ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండదు. ప్రతిరోజు ఆయన నీతి సూక్తులు వల్లివేస్తుంటారు. కానీ, ఆచరణలో మాత్రం అవేవీ పాటించరు. ఎవరు దుర్భాసలాడకూడదు అంటూ నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ మాత్రం.. ఎదుటివారి గురించి అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదని చెబుతున్న పవన్ కళ్యాణ్.. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రోడ్డు ఎక్కి మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మాటలను మర్చిపోయినట్లున్నారు అంటూ పలువురు పేర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు అంటూ వైసీపీకి చెందిన కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్.. అదే తమ కూటమి పార్టీలకు చెందిన సామాజిక కార్యకర్తలు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం పై అసభ్యకరంగా పెడుతున్న పోస్టులు గురించి మాత్రం మాట్లాడరు. తనకు తగిలితేనే దెబ్బ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ విలవిలాడుతుంటారని.. ఎదుటివారికి తగిలే దెబ్బలను మాత్రం ఈయన హేళన చేస్తూ ఉంటారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
సంస్కారవంతమైన భాష మాట్లాడాలంటూ ఇతరులకు చెప్పే పవన్ కళ్యాణ్.. తాను మాత్రం వల్గర్ భాష మాట్లాడుతుంటారు. ‘పెన్నా నది నేలను విడిచి పోతుందా. కష్టాలు వచ్చిన పొడు. జగన్ వచ్చినా, జగన్ అమ్మ మొగుడు వచ్చిన మనం పారిపోము. ఇక్కడే కూర్చుని నిలబడతాం. పోరాడుతాం. చొక్కా పట్టుకొని నిలదీస్తాం. మన హక్కుల్ని సాధించుకుందాం. ఇది మన హక్కు. ఇది మన నేల’ పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఊగిపోయి మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడు అంటూ వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాత్రం నీతి కబుర్లు చెబుతున్నారు అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు గురించి ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక పోతున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడే పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తలు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన ఎంతోమంది పవన్ కళ్యాణ్ ఎంతో సంస్కారవంతమైన భాష మాట్లాడుతున్నారని, ఈయనను చూసి సంస్కారవంతమైన భాష ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.