పవన్.. ఎంత పని చేశావయ్యా? వైరల్ వీడియో

ఏపీలో ముగ్గురు కేంద్రంగానే అధికారం నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంగానే అధికారం కేంద్రీకృతమైంది. మిగిలిన మంత్రులంతా నామ్కే వాస్తే అన్న చందంగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. ఈ పరిస్థితిని తేటతెల్లం చేస్తూ తాజాగా ఒక ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. డయేరియా బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్లకు వచ్చారు. గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆసుపత్రి లోపల బాధితులను పరామర్శిస్తున్న సమయంలో జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి వచ్చారు. లోపలకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది అందుకు అనుమతించలేదు. స్వయంగా జిల్లాకు చెందిన మంత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం పట్ల అక్కడ ఉన్న మంత్రి శ్రీనివాస్ అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రిని అడ్డుకోవడం ఏంటి అంటూ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. ఒకరకంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ వెనక్కి తగ్గిపోయారు. లోపల ఖాళీ లేదంటూ అనుచరులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇదెక్కడి విచిత్రం మహాప్రభు అన్న చందంగా మంత్రి హవభావాలను ప్రదర్శించారు. జిల్లాకు చెందిన మంత్రి అయిన తనకే పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లే అవకాశాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఇవ్వకపోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి అన్న భావనను వ్యక్తం చేసేలా మంత్రి వ్యవహార శైలి అక్కడ కనిపించింది. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తీరు పట్ల టిడిపి నాయకులు కార్యకర్తలతోపాటు మంత్రి అనుచరులు రగిలిపోతున్నారు. ఆయన కూడా కొండపల్లి శ్రీనివాస్ మాదిరిగానే క్యాబినెట్ మంత్రి అని, సహచర మంత్రికి గౌరవం ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ పాటించకపోవడం, సదరు సెక్యూరిటీ సిబ్బందికి కనీసం ఈ విషయం కూడా తెలియకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయినా పరిస్థితి ఉందంటే.. ఇక అటువంటి పదవులు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న బావనను పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా చర్యలను టిడిపి అధిష్టానం కఠినంగా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మంత్రి కే గౌరవం దక్కనచోట సాధారణ కార్యకర్తలకు, నాయకులకు ఎక్కడ లభిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఆధ్యాంతం జనసేన నేతల హడావిడి ఉందని, జనసేన పార్టీ కార్యక్రమంగా పరామర్శను చేశారే తప్ప, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చినట్లుగా కార్యక్రమాన్ని నిర్వహించలేదంటూ కొండపల్లి శ్రీనివాస్ అనుచరులు బయటే ఆవేదన వ్యక్తం చేస్తూ అసహనాన్ని వెళ్ళగక్కారు. పాపం కొండపల్లి శ్రీనివాస్ బయటకు వచ్చిన సమయంలో చూసిన ఎంతోమంది ఎంత పని చేశావయ్యా పవన్ కళ్యాణ్ అంటూ ఆయనపై జాలి చూపించడం గమనార్హం.

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పట్ల తీవ్ర ఇబ్బందికి గురైన కొండపల్లి శ్రీనివాస్ శాంతియుతంగానే వెనక్కి తగ్గారు. ఆయన స్థానంలో మరో మంత్రి ఉండి ఉంటే ఈపాటికి రచ్చ మరో స్థాయిలో ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా తాజా ఘటన టిడిపి శ్రేణులను రగిలిపోయేలా చేస్తోంది. దెబ్బకు దెబ్బ తీస్తామని, తమకు సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కు అటువంటి గతి పట్టేలా చేస్తామంటూ పేర్కొంటున్నారు. క్యాబినెట్ మంత్రిని అనుమతించకపోవడం దారుణమని, సెక్యూరిటీ సిబ్బంది చేసిన అతిని కొందరు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మంత్రని కూడా డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళనీయకూడదు అన్న నిబంధనలు ఎక్కడ ఉన్నాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్న ఎంతోమంది.. రానున్న రోజుల్లో చంద్రబాబు తనయుడికి ఇదే గతి జనసేన నేతలు పట్టిస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.