చంద్రబాబుతో జాగ్రత్త పవన్

రాష్ట్రంలో కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూటమి పార్టీల్లో అగ్గి రాజేస్తుస్తున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ పవన్ కళ్యాణ్ కు కీలక సూచనలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన పాల్ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు నాయుడు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్క క్షణంలో తీసి పక్కకు పడేస్తాడని హెచ్చరించారు. 175 మంది ఎమ్మెల్యేల్లో పవన్ కళ్యాణ్ కు 20 మంది మాత్రమే ఉన్నారన్న కేఏ పాల్.. 20 మందితో ముఖ్యమంత్రి కావడం సాధ్యపడుతుందా.? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎజెండా పూర్తిగా మారిపోయిందని ఎద్దేవా చేసిన పాల్.. బిజెపి అధికారి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే లడ్డు వివాదాన్ని సృష్టించాడని, నెయ్యిలో కల్తీ జరగకపోయినా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. రాత్రికి రాత్రి సనాతన ధర్మం పరిరక్షకుడి అవతారం ఎత్తాడని పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భార్య, పిల్లలు క్రిస్టియన్స్ అని, అటువంటి పవన్ కళ్యాణ్ రాత్రికి రాత్రి ఎలా సనాతన ధర్మ పరిరక్షకుడు అవుతాడని ప్రశ్నించారు.

సనాతన ధర్మంలో విడాకులు ఉండవని, మరి తనను తాను సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలియదా.? అని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలని, ఈ విషయంలో స్టాండ్ మార్చుకోవద్దని సూచించారు కేఏ పాల్. మొన్న మాయావతితో ఉన్నావని, ప్రస్తుతం బిజెపితో చేరావన్న కేఏ పాల్.. భవిష్యత్తులో ఎవరితో వెళ్తావో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకు కోపం వస్తే రాత్రికి రాత్రే నిన్ను మంత్రి పదవి నుంచి తీసిపడేస్తాడని కేఏ పాల్ స్పష్టం చేశారు. కాబట్టి హోం మంత్రి పదవి గురించి ఆలోచించ వద్దని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేఏ పాల్ హిత బోధ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు చూసేయండి.