Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కనిపించదు.. వినిపించదు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి చేసే వ్యవహారాలు మాత్రమే కనిపిస్తాయి. ఆయన మాటలు మాత్రమే వినిపిస్తాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యథేచ్ఛగా దాడులు జరుగుతున్న, చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ఆయన మాత్రం స్పందించడం లేదు. ఏపీలో పవన్ కళ్యాణ్ సాగించే రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన రాజకీయం అంతా వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రీకృతంగానే సాగుతుంది అని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. జగన్ అధికారంలో ఉంటే ఆయన్నే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన్నే విమర్శిస్తుంటారు పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న తిరుపతి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ నానా యాగి చేసిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడు అవతారం ఎత్తి విజయవాడ దుర్గమ్మ మెట్లను కడిగి పాప పరిహారాన్ని చేసుకున్నట్లు ప్రకటించారు.
ఆ తరువాత దీక్షకు దిగిన పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ పరిహార ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. ఇదంతా ఆయన రాజకీయ మైలేజీ కోసం పడుతున్న పాట్లుగా జనం నవ్వుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మేనల్లుడు, నటుడు సాయిధరమ్ తేజ్ ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఏపీ షేప్ హాండ్స్ లో ఉందంటూ ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై అప్పట్లోనే తీవ్రమైన విమర్శలు వ్యక్తం అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన రౌడీయిజం, అత్యాచారాలు, దాడులు వంటి ఘటనలను సాయిధరమ్ తేజ్ కు ట్యాగ్ చేస్తూ నెటిజన్లు తూర్పారబట్టారు.
తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో నిర్వహించిన డిబేట్లో ఒక విశ్లేషకులు కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజల, మానప్రాణ హననం జరుగుతోందని, రాజ్య హింస జరుగుతోందంటూ సదరు విశ్లేషకుడు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, ఈ దాష్టికాలు కనిపించడం లేదా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ తరహా దాడుల నుంచి కాపాడాల్సి ఉన్నా పట్టనట్టు వ్యవహరించడం పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంటే తిని నిద్రపోతే సరిపోతుందా.? అంటూ అసహనం వ్యక్తం చేసిన సదరు విశ్లేషకుడు.. శాంతిభద్రతలు లేని రాష్ట్రంలో ఏముంటుంది పవన్ గారు అని ప్రశ్నించారు. శాంతి భద్రతలను కాపాడడమే అభివృద్ధి కదా.? అని ఆయనకు హితబోధ చేశారు. అభివృద్ధి ఉన్నచోట శాంతి భద్రతలు ఉంటాయని, శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి ఉండదంటూ ఆ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
గతంలో ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటూ ట్వీట్ చేసిన సాయిధరమ్ తేజ్ తోపాటు పవన్ కళ్యాణ్ కు పలువురు నెటిజన్లు ఏబీఎన్ ఛానల్ లో నడిచిన ఈ డిబేట్ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అనేక ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు లక్ష్యంగా జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలను సదరు విశ్లేషకుడు మాట్లాడిన మాటలకు జోడించి షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ? pic.twitter.com/uZ2GNI4eci
— Inturi Ravi Kiran (@InturiKiran7) October 20, 2024