అలీ పవన్ కు దగ్గర అవుతున్నారా? దగ్గర కావాలని చూస్తున్నారా? అందుకే రాజకీయ నిష్క్రమణ ప్రకటన ఇచ్చారా? తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అందుకే చెప్పారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో తనకు పవన్ అంటే ఇష్టమని ఆలీ చెప్పుకొచ్చారు. ఆయనతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వారిద్దరి మధ్య చాలా స్నేహం ఉండే విషయం తెలిసిందే. దాదాపు పవన్ చిత్రాలన్నింటిలోనూ అలీ కనిపిస్తారు. కానీ వారిద్దరి మధ్య రాజకీయంగా గ్యాప్ వచ్చిన తర్వాత.. వారి కాంబినేషన్ తప్పింది. పవన్ సినిమాల్లో అలీ కనిపించడం మానేశారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో.. పవన్ తో పాటు సినిమాల్లో నటించాలని అలీ భావిస్తున్నారు. తన మనసులో మాటను బయటపెట్టారు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ. అంతవరకు టిడిపి సానుభూతిపరుడుగా ఉండేవారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధి కావాలన్నది అలీ లక్ష్యం. చట్టసభల్లో అడుగు పెట్టాలన్నది కోరిక. కానీ తెలుగుదేశం పార్టీలో ఛాన్స్ లేకపోవడంతో 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు అలీ. అప్పటికే జనసేన రూపంలో ఆప్షన్ ఉన్నా.. వైసీపీలో చేరారు అలీ. అప్పటి నుంచే పవన్ తో ఆయనకు గ్యాప్ వచ్చింది. అలీని పవన్ అభిమానులు టార్గెట్ చేసుకున్నారు. పవన్ సైతం అలీని తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అలీ సైతం పవన్ పై గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. వైసీపీ అధికారానికి దూరమైంది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. అందుకే ఇప్పుడు అలీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారు అని. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో కీలక పదవి దక్కుతుందని ఆశించారు. రాజ్యసభ కానీ.. ఎమ్మెల్సీ కానీ ప్రకటిస్తారని భావించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా సరిపెట్టారు. అయినా సరే 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తారని భావించారు అలీ. అందుకే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ టికెట్ ఇవ్వకుండా మరోసారి దగా చేశారు జగన్. అందుకే ఈ ఎన్నికల్లో అసలు అలీ ప్రచారం చేయలేదు. ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయంతో.. పూర్తిగా రాజకీయాలకు దూరం కావాలని అలీ నిర్ణయం తీసుకున్నారు. అందుకే తనకు ఏ పార్టీతో సంబంధం లేదని ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేశారు.
అయితే తాజాగా అలీ యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఓ టీవీ షోకు హాజరయ్యారు. ఈ క్రమంలో సుమకీలక ప్రశ్నలు వేశారు. మీకు ఎవరితో నటించడం కంఫర్ట్ గా ఉంటుందని, ఎవరంటే ఇష్టమని ప్రశ్న అడిగారు. రవితేజ, పవన్ కళ్యాణ్ ను ఆప్షన్ గా ఇచ్చారు. కనీసం ఆలోచించకుండానే అలీ నోటి నుంచి పవన్ అనే మాట వచ్చింది. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు అలీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పరిస్థితి చేయి దాటడం వల్లే అలీ మాట మార్చారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే అలీ రాజకీయాల్లో ఉన్నారే తప్ప.. ఎన్నడు పవన్ పై వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారే తప్ప.. రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నడూ మాట్లాడలేదు. అందుకే అలీని ప్రత్యర్థులు సైతం టార్గెట్ చేయడం లేదు. అయితే మంచి స్నేహితుడిగా ఉన్న పవన్ ను విడిచిపెట్టి.. జగన్ చెంతకు అలీ చేరడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. ఇప్పుడు అలీ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన కచ్చితంగా పవన్ గూటికి చేరతారనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
పవన్ డిప్యూటీ సీఎం కావడంతోనే అలీ భయపడి వైసీపీకి రాజీనామా చేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి కాదని అవకాశాలు దక్కించుకోవడం అంత ఈజీ కాదని ఒక ప్రచారం ఉంది. అయితే పవన్ విషయంలో విభేదించిన అలీ.. చిరంజీవిని మాత్రం చాలా సందర్భాల్లో గౌరవిస్తూ ముందుకు సాగారు. అయితే కేవలం రాజకీయ విభేదాలతోనే పవన్ సినిమాల్లో అలీ కనిపించడం మానేశారు. వారిద్దరిది క్రేజీ కాంబినేషన్. ఇప్పుడు అవకాశాలు తగ్గడం వల్లే అలీ పునరాలోచనలో పడ్డారని టాక్ నడుస్తోంది. కానీ అలీ మాత్రం తనకు పవన్ అంటే ఇష్టమని చెప్పడం ద్వారా బలమైన సంకేతాలు పంపగలిగారు. దీనిని మెగా కుటుంబం, మెగా అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి.