సాధారణంగా మాంసం ఎక్కడుంటే.. కాకులు అక్కడే ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ సమయంలో మటన్ లేదా చికెన్ కొట్టేటప్పుడు.. గుంపుగా అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఎప్పుడెప్పుడు మాసం ముక్క ఎత్తుకెళదామా? అని ఆశగా చూస్తుంటాయి. ఇక చికెన్, మటన్ షాపుల ముందు అయితే గుంపులు, గుంపులుగా తిరుగుతుంటాయి. యజమానులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కొన్నిసార్లు మాంసం ముక్కలు ఎత్తుకెళుతుంటాయి. దాంతో షాప్ యజమానులకు చిర్రెత్తుకొస్తుంటుంది. అలా చిర్రెత్తిపోయిన ఓ యజమాని ఓ కాకిని తాడుతో కట్టేశాడు. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో చోటుచేసుకుంది.
వివరాలు ప్రకారం… తాటిపాక డైలీ మార్కెట్‌లో కొన్ని చికెన్ షాపులు ఉన్నాయి. ఓ చికెన్ షాపు దగ్గరకు ఓ కాకి డైలీ వస్తోంది. చికెన్ ముక్కలు కూడా ఎత్తుకెళుతుంది. ఎన్నిసార్లు తరిమేసినా కూడా మళ్లీ ళ్లీ రావడంతో ఆ యజమాని విసిగిపోయాడు. తాజాగా కాకిని షాపు దగ్గరకు రానిచ్చి.. చాకచక్యంగా పట్టుకున్నాడు. దాన్ని ఓ తాడుతో కట్టేశాడు. దాంతో కాకి అరవసాగింది. ఆ అరుపులు విన్న వందలాది కాకులు షాపు వద్దకు వచ్చాయి. ఆ చుట్టుపక్కలే ఎగురుతూ.. పెద్దగా అరిచాయి. తమ మిత్రుడి కోసం వందలాది కాకులు చికెన్ షాపుపై దండెత్తాయి.
చికెన్ షాపు చుట్టూ కాకులు పెద్దగా అరవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారికి విసుగొచ్చింది. అయినా సరే చికెన్ షాపు యజమాని ఆ కాకిని విడిచిపెట్టలేదు. మార్కెట్‌కు వచ్చిన జనాలు ఈ కాకుల అరుపులకు విసుగు చెందారు. అక్కడి దుకాణదారులు సైతం విసిగెత్తిపోయారు. కాకుల గోల భరించలేక.. బంధించిన కాకిని వదిలేయాలని చికెన్ షాపు యజమానిని అందరూ కోరారు. దాంతో చికెన్ షాపు యజమాని ఆ కాకిని వదిలేశాడు. దాంతో పాటు మిగతా కాకులు అన్ని అక్కడినుంచి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకుల యూనిటికి అందరూ ఫిదా అవుతున్నారు.