ఇది చెత్త ప్రభుత్వం

Chandrababu Govt away from garbage collection

ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేందుకు ఉపయోగించే క్లాప్ (క్లీన్ ఆంధ్ర ప్రదేశ్) వాహనాల సేవలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చెత్త సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడి అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డయేరియా ప్రబలి ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలోని గుర్లలో డయేరియా బారిన పడి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అపారశుధ్య వాతావరణంతో ప్రజలు రోగాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చెత్తను తొలగించకుండా ప్రజలు రోగాలు బారిన పడేలా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం గతంలో కొంత చొప్పున పన్ను వసూలు చేసింది. ఈ మొత్తాన్ని చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలకు, ఇంటింటికి వచ్చి చెత్త సేకరించి సిబ్బంది జీతభత్యాలకు ప్రభుత్వం వినియోగించింది. దీనిపై అప్పట్లో టిడిపి, జనసేన నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. చెత్త మీద పన్ను వసూలు చేసే చెత్త సీఎం అంటూ పలువురు టిడిపి నేతలు తీవ్రస్థాయిలోనే జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యానించారు. కాలం గడిచింది. రోజులు మారాయి. ప్రభుత్వము మారింది. గత వైసిపి ప్రభుత్వంలో చెత్తపై విధించిన పన్నును తాజాగా కూటమి ప్రభుత్వం ఎత్తేసింది. దీన్ని గొప్ప కార్యంగా కూటమి నాయకులు చెప్పుకున్నారు.

అయితే చెత్త పన్ను ఎత్తేసిన కూటమి ప్రభుత్వం.. చెత్తను ఎత్తేయడం కూడా మరిచిపోయింది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎక్కడకక్కడే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెత్తపై ఈగలు, దోమలు వాలి ఆయా ప్రాంతాల్లో ప్రబలుతున్నాయి. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున రోగాలు బారినపడి ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది రోజులు తరబడి జ్వరాలతో మంచానికే పరిమితం అవుతుండగా, మరి కొంతమంది డయేరియా వంటి వ్యాధులు బారినపడి ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. వేలాది రూపాయలు వైద్యానికి వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొందంటూ పలువురు వాపోతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెత్తపైన పన్ను ఎత్తేసిన ప్రభుత్వం.. చెత్తను కూడా ఎత్తడం మానేసిందంటూ పలువురు విమర్శిస్తున్నారు. గతంలో ఇంటింటికి వచ్చి చెత్తను తీసుకెళ్లడం వలన ఎటువంటి ఇబ్బందులు రాలేదని.. ఈ ప్రభుత్వం చెత్తను కుప్పలు, కుప్పలుగా వదిలేయడంతో రోగాల బారిన పడి అల్లాడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి పట్ల సామాజిక మాధ్యమాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త మీద పన్ను వేస్తే చెత్త సీఎం అయిపోడు.. చెత్త సేకరణ చేయకుండా జనాన్ని రోగాలకు వదిలేస్తాడు చూడు వాడు అసలు సిసలు చెత్త సీఎం అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మీమ్స్ పేలుతున్నాయి. చెత్త పన్ను తొలగిస్తామని చెప్పామని.. చెప్పినట్టుగానే చెత్త పన్ను తొలగించామని, చెత్తను తొలగిస్తామని మాత్రం చెప్పలేదని.. అందుకే చెత్తను వదిలేసాము అంటూ టిడిపి నాయకులు చెబుతున్నట్టుగా పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై కూటమి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.