టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత లేకుండా పోతోంది. పుంగనూరులో ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మరోసారి ఎంపీగా గెలిచినా వారిని మాత్రం తమ ఇళ్లకు రాకుండా టీడీపీ క్యాడర్ అడ్డుకుంటోంది. ఇవాళ మరోసారి అదే పరిస్ధితి రిపీట్ అయింది.
పుంగనూరు పట్టణం టీచర్స్ కాలనీలో వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు ఇవాళ రాళ్లదాడికి దిగారు. అయితే ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేరుకోవడంతో ఆయన్ను కూడా లక్ష్యంగా చేసుకుని కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిదున్ రెడ్డిపై రాళ్లు విసిరారు. ఆయన వాహనంపై దాడికి పాల్పడ్డారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
మరోవైపు మిథున్ రెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీ మిదున్ రెడ్డిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకొంటే బాగుంటుందన్నారు.